logo

అధ్యక్షుని సందేశం

 

ప్రపంచ వేగంతో పోటీ పడుతూ, నలుదిశలా ఖ్యాతిని చాటుతూ, విజయోత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నఅశేష ప్రవాస తెలుగు జనవాహినికి నమస్సుమాంజలి.

ముందుగా అందరికీ హేవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉనికిని చాటుతూ గత రెండేళ్లుగా అనేక సంఘాలు ఆవిర్భవిస్తున్నాయి. ఇది శుభ పరిణామమే. కానీ అవి కుల, ప్రాంత రాజకీయాలకు ఆలవాలాలుగా మారుతుండటం దురదృష్టకరం. తద్వారా ప్రవాసుల మధ్య మనోభావాల సంఘర్షణ నెలకొని వారి మనసుల మధ్య అంతరాలు కలిగించిన విషయం వాస్తవం. కాలమే సమస్యకు పరిష్కారం చూపించగలదన్న ఆశాభావం నేటి యువతరానిది. బ్రెక్సిట్ వంటి మారుతున్న సామాజిక పరిణామాల మధ్య మన ఉనికిని కాపాడుకోవాలంటే “భిన్నత్వంలో ఏకత్వం” స్ఫూర్తిని పాటించాల్సిన ఆవశ్యకత ఏర్పడనుంది. అందుకు అన్ని సంఘాలు ఒక త్రాటి మీద నడవగలిగినప్పుడే బ్రిటన్ భవిష్యత్తుకు మనవంతు ముద్ర వేయగలం.

నిన్న రేపటికి చరిత్రగా మిగులుతుంది. గత చరిత్ర ఎప్పుడూ ఘనమే. గతాన్ని తల్చుకుంటూ మీన మేషాలు లెక్కపెట్టే యుగంలో నేడు మనం లేము. చరిత్రతో సంబంధం లేకుండా చరిత్ర సృష్టిస్తున్న ఆధునిక సాంకేతిక కాలంతో పోటీ పడుతున్నాం. వికీపీడియాకి మాత్రమే పరిమితం అయిపోతున్న చరిత్రతో మనకేంటి పని అని ఆలోచిస్తున్న నవయుగంతో సమాలోచన చేసి గమనాన్ని మార్చుకోవాల్సిన అవసరం యుక్తా  గుర్తించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. మార్పుని శుభపరిణామంగా పరిగణించి పంథా మార్చుకున్నఫుడే  అందరికీ చేరువవ్వగలం అనే వ్యూహంతో సాగటానికి కృతనిశ్చయంతో ఉన్నాం. “జయతే కూచిపూడి” ద్వారా మేము ఇవ్వదలచిన సందేశం ఇదే. ఈ ప్రయత్నానికి రాయబారిగా వ్యవహరించటానికి ముందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు.

గత ఆరు సంవత్సరాలుగా బ్రిటన్ తెలుగు వాసులతో మమేకమై తెలుగు పండుగలే  వేదికగా అనేక సాంఘిక,సాహిత్య, సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జీవిత ప్రస్థానంలో తమకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుని ఆదర్శవంతంగా నిలిచే తెలుగు ప్రముఖలతో వారి అభిమానులను చేరువ చేస్తూ అందరి ఆదరాభిమానాలతో వర్థమాన దిశగా అడుగులేస్తోంది యుక్తా.  సుమారు వంద పైచిలుకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి పది వేలకు పైగా ప్రవాస భారతీయులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించిన సేవా ధృక్పథం యుక్తాది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా కష్ట సమయాల్లో అండగా నిలబడిన సందర్భాలు అనేకం.

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలన్నది యుక్తా ఆకాంక్ష. ఈ ప్రయత్నంలో సహకరిస్తున్న ఎందరో మహానుభావులకు పాదాభివందనములు.

ఇట్లు,

మీ

ప్రసాద్