logo

‘యుక్తా’ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం

లండన్: లండన్‌లో యునెటైడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) అధ్వర్యంలో నిర్వహించిన తొలి బాలల దినోత్సవ వేడుకలకు విశేష స్పందన కనిపించింది. స్థానిక మే ఫెయిర్‌లో నున్న భారతీయ రాయబార కార్యాలయ సాంస్కృతిక విభాగం నెహ్రూ సెంటర్‌లో బాలల దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా బాలలు పాల్గొని.. భారత దేశానికి చెందిన ప్రముఖ నాయకుల వస్త్రధారణతో ఆహూతులను ఆలరించారు. బాలల దినోత్సవ వేడుకలో భారతీయ విద్యాభవన్ ఉప సంచాలకులు నందకుమార్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాలలకు పండిట్ నెహ్రూ జన్మదినం ఒక పండుగ లాంటిదని అన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాల్ని సభికులతో నందకుమార్ పంచుకున్నారు. నేటి పిల్లల్లో సృజనాత్మకత, కళాభిమానం చూస్తూంటే చాలా సంతోషంగా ఉందని.. వారికి ప్రోత్సాహం అందించడానికి ఎప్పుడూ ‘యుక్తా’ ముందుంటుందని అధ్యక్షులు కాఱా ప్రభాకర్ అన్నారు. యుక్తా అందించే సహకారాన్ని తల్లితండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభాకర్ కోరారు.

సాంస్కృతిక కార్యక్రమాల్ని దివ్య వెంకటేష్ తన శిష్యులతో ప్రారంభించారు. ఆ తర్వాత వింజమూరి రాగసుధ శిక్షణలో ‘ప్రజ్ఞ’ విద్యార్తులు ప్రదర్శించిన ‘కొత్త-పాత మేలు కలయిక’ దేశ భక్తి గీతాలు, బాలీవుడ్ గీతాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. పండిట్ నెహ్రూకి ఇష్టమైన ‘సారే జహా సే అచ్చా’ అనే గీతాన్ని వేణువుపై వాయించిన మాస్టర్ స్టాన్సిక్ మొంధాల్ ప్రదర్శన, మాస్టర్ అజిత్ కిళ్లి, శ్రేష్టో భౌమిక్‌ల తబలా, వయోలిన్, మృదంగం, జుగల్ బందీ, వివేఖ్ గుంటుపల్లి పంజాబీ డోలు ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచాయి. చివర్లో వాయునాయుడు కంపెనీ వారు బాలల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘క ధా మాధురి’కి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు యుక్తా ప్రతినిధులు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ వేడుకల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కీర్తి కిళ్లిని పలువురు ప్రశంసించారు. వివేఖ్ గుంటుపల్లి వందన సమర్పణతో బాలల దినోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిసాయి.