logo

కర్వ్ కాపిటల్ కప్ టోర్నమెంట్ విజయవంతం

అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో కర్వ్ కాపిటల్ సంస్థ నిర్వహించిన కర్వ్ కాపిటల్ కప్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. బ్రిటన్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులను, విద్యార్థులను ఏక త్రాటి పైకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ నిపుణులు పాల్గొన్నారు.
 

ఫైనల్ లో ఇలైట్ క్రికెట్ క్లబ్, వైజ్ మెన్ క్లబ్ తలపడగా, వైజ్ మెన్ క్లబ్ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ ఇక్బాల్ మాట్లాడుతూ, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారిని ఒక చోటకి చేర్చే శక్తి కేవలం క్రీడలకి మాత్రమే ఉందని అన్నారు. తాను హైదరాబాద్ లో పుట్టి పెరిగినప్పటికీ, పాకిస్తాన్లో స్థిరపడటం ద్వారా ఆ దేశ జట్టుకి సారధ్యం వహించే అవకాశం తనకు రావటం తద్వారా ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టుని సెమీ ఫైనల్ కు చేర్చిన మొదటి కెప్టెన్ గా పేరు రావటం వంటి అనుభవాలను అందరితో పంచుకున్నారు.

ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్ గా వ్యవహరించిన కర్వ్ కాపిటల్ అధినేత వినయ్ గంగా మాట్లాడుతూ తోటి తెలుగు వారికి ఈ రకంగా సహాయ సహకారాలు అందించ గలిగే అవకాశం తనకు ఇచ్చిన యునైటెడ్ కింగ్డం తెలుగు అసోసియేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ఈ టోర్నమెంట్ ప్రతి ఏడాది నిర్వహించాలని, దానికి తమ సంస్థ నుంచి నిధులు మంజూరు అయ్యేలా ఏర్పాటు చేస్తానని అన్నారు. యుక్తా అధ్యక్షులు ప్రభాకర్ కాజా మాట్లాడుతూ ఇక పై ఈ టోర్నమెంట్ 20 ఓవర్లకు విస్తరిస్తామని, వీలైనన్ని జట్లు పాల్గొనాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. టోర్నమెంట్ వీక్షించటానికి వచ్చిన వారందరికీ యుక్తా సంస్థ భోజన సదుపాయాలతోపాటు, లార్డ్స్ టూర్ ఏర్పాటు చేసింది. అది కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో భాగంగా సిలికాన్ ఆంధ్ర వారి సౌజన్యంతో జొన్నవిత్తుల రాసిన "బతుకమ్మ శతకం" పుస్తకాన్ని ఆవిష్కరించారు.