logo

‘యుక్త’ ఆధ్వర్యంలో ఉగాది కోలాహలం

ఆనందోత్సాహాలతో జరుపుకునే ఉగాది ఉత్సవాలను యునెటైడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఈనెల 23న బర్మింగ్‌హమ్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించింది. శ్రీఖర నామ సంవత్సరానికి స్వాగతం పలకటానికి ముఖ్య అతిథిగా భారత్ కాన్సుల్ జనరల్ గురురాజ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ జన్మించిన మూడోతరం వారికి తెలుగు భాషలోని మాధుర్యం, గురువుల ప్రాముఖ్యతను వివరించారు.యుక్త అధ్యక్షులు కాజా ప్రభాకర్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను సభికులకు వివరించి కార్యవర్గ సభ్యులను పరిచయం చేశారు.
 

శ్రీమతి కళ్యాణి గేదెల ఆలపించిన ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’’ పాటతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ రంగస్థల నటుడు సిద్దారెడ్డి ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబార ఘట్టంలోని ‘‘బావా ఎప్పుడు వచ్చితివి’’, ‘‘చెలియా చెల్లకో’’ పద్యాలకు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. క్రమేపీ అంతరించిపోతున్న రంగస్థల నటనకు చేయూత నివ్వాలని వ్యాఖ్యాత శ్రీమతి శశికళ తాళ్ళం ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు. బేబీ శాన్వి ఆలపించిన ‘‘ముద్దుగారే యశోద’’ అన్నమాచార్య కీర్తన ముఖ్య అతిథుల మన్ననలు పొందింది. అనంతరం దివ్య వెంకటేష్ ప్రదర్శించిన వందేవాసుదేవం, నాద తనుమనిషం భరతనాట్య ప్రదర్శన అందరి ప్రవశంసలు అందుకుంది.

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు నారాయణరావు, కార్యనిర్వాహకులు డాక్టర్ కర్రి రామశర్మతో పాటు చుట్టుపక్కల పట్టణాల నుంచి వచ్చిన సుమారు 500 మంది తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు పాల్గొన్న వారందరికీ ఉగాది పచ్చడితో కూడిన భోజనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. యుక్త కోశాధికారి జయకుమార్ గుంటుపల్లి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.